నాడు అదే ఆఫీసులో అటెండర్.. నేడు బాస్‌, ఆయన ఎంతోమందికి ఇన్‌స్పిరిషన్

Date:

సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల తహసీల్దార్ కార్యాలయంలో ఒక అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. సుమారు 30 ఏళ్ల క్రితం ఏ కార్యాలయంలోనైతే అటెండర్‌గా అధికారుల ఆదేశాలను పాటించారో.. నేడు అదే కార్యాలయానికి ఉన్నతాధికారిగా బాధ్యతలు స్వీకరించి అసాధారణ విజయాన్ని నమోదు చేశారు సోమపంగు సూరయ్య. పట్టుదల కృషి ఉంటే సామాన్యులు కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఆయన నిరూపించారు. అటెండర్‌ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ తహసీల్దార్‌ బాధ్యతలు చేపట్టడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం రాఘవపురం గ్రామానికి చెందిన సోమపొంగు భద్రయ్య ఏడుగురు సంతానంలో సూరయ్య మూడో వ్యక్తి. భద్రయ్య 1995లో నడిగూడెం తహసీల్దార్‌ కార్యాలయంలో అటెండర్‌గా విధులు నిర్వహించేవారు. అయితే అనారోగ్య కారణాల వల్ల ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ పొందడంతో.. కారుణ్య నియామక పథకం కింద సూరయ్యకు ఆ ఉద్యోగం లభించింది. 1995 జూన్ 26న తండ్రి పనిచేసిన అదే నడిగూడెం కార్యాలయంలో అటెండర్‌గా సూరయ్య తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఐదేళ్ల పాటు అదే పోస్టులో కొనసాగుతూ విధి నిర్వహణలో మెళకువలు నేర్చుకున్నారు.

తన విద్యా అర్హతలను మెరుగుపరుచుకుంటూ సూరయ్య పదోన్నతుల వేటలో పడ్డారు. 2000 నుంచి 2002 వరకు మునగాల మండలంలో.. ఆ తర్వాత తిరిగి నడిగూడెంలో 2006 వరకు అటెండర్‌గా పనిచేశారు. 2006లో ఆయనకు తొలి పదోన్నతి లభించింది. మఠంపల్లి మండలంలో జూనియర్ అసిస్టెంట్‌గా చేరిన ఆయన.. రెండేళ్ల తర్వాత సీనియర్ అసిస్టెంట్‌గా బదిలీపై మళ్లీ నడిగూడెం చేరుకున్నారు. 2010లో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ)గా ప్రమోషన్ పొంది మేళ్లచెరువు వెళ్లారు. మట్టంపల్లి నడిగూడెం మండలాల్లో ఆర్‌ఐగా సేవలందిస్తూ రెవెన్యూ వ్యవస్థపై పట్టు సాధించారు.

2017లో సూరయ్యకు డిప్యూటీ తహసీల్దార్‌గా ఉద్యోగన్నతి లభించింది. కోదాడలో ఎలక్షన్ డ్యూటీతో పాటు రెగ్యులర్ డీటీగా రెండేళ్ల పాటు బాధ్యతలు నిర్వర్తించారు. 2021లో చింతలపాలెంలో ఇన్చార్జి తహసీల్దార్‌గా 11 నెలల పాటు పనిచేసిన అనుభవం ఆయనకు కలిసొచ్చింది. 2022 నుంచి 2024 వరకు మోతే మండలంలో పనిచేసి.. తాజాగా 2026 మార్చి 31న నడిగూడెం మండల ఎఫ్ఎసీ తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టారు. తాను అటెండర్‌గా సంతకం పెట్టిన కార్యాలయంలోనే నేడు మండల అధికారిగా బాధ్యతలు తీసుకోవడం తనకు ఎంతో గర్వకారణమని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

తన జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోవడంలో సహకరించిన జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్‌ కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణలకు సూరయ్య కృతజ్ఞతలు తెలిపారు. సూరయ్య పెద్ద కూతురు ప్రస్తుతం గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతుండగా.. చిన్న కూతురు హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఒక సామాన్యుడు పట్టుదలతో శ్రమిస్తే అత్యున్నత స్థాయికి చేరవచ్చని చెప్పడానికి సూరయ్య ప్రస్థానం నేటి యువతకు గొప్ప సందేశాన్ని ఇస్తోంది.

ALSO READ: యువతకు మరో అవకాశం.. ఆర్మీ రిక్రూట్‌మెంట్ గడువు పొడిగింపు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

నారా లోకేష్ ఎక్కడ…?!

గత కొద్ది రోజులుగా కనిపించని యువనేత వైయస్సార్ కాంగ్రెస్...

అందరివాడు రేవంత్…!

కాంగ్రెస్ అగ్రనాయకత్వం నమ్మకం కేంద్ర బిజెపి పెద్దల పాలనా సహకారం...

గులాబీ పార్టీలో కళావిహీనం…!

సందడి లేని ఆవిర్భావ దినం పాతికేళ్ల ప్రస్థానంలో ఎన్నడూ లేని...

అచ్చం తండ్రి మాదిరిగా…?!

ట్రెండీ లుక్ తో విదేశీ పర్యటనకు జగన్మోహన్ రెడ్డి ...